- సత్ఫలితాలు ఇస్తున్న ప్రభుత్వ, ఈగల్ టీమ్ చర్యలు
ఖమ్మం రూరల్/నేలకొండపల్లి/కూసుమంచి, వెలుగు : మాదకద్రవ్యాల మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు ప్రభుత్వం, ఈగల్ టీమ్ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని, అందరూ కలిస్తేనే డ్రగ్స్, గంజాయి కట్టడి సాధ్యమవుతుందని రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన 'నషా విముక్త్ భారత్' అవగాహన క్విజ్ పోటీల్లో మంత్రి పాల్గొన్నారు.
అనంతరం కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్ మండలాల్లోని వెంకటాయపాలెంలో కొత్తగా మంజూరైన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఐపీఎస్ ఆఫీసర్ల పర్యవేక్షణలో 600 మందితో ఈగల్ టీమ్ ఏర్పాటు చేసి, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 వేల కేసులు నమోదు చేసి, 19 వేల మందికి పైగా నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.
డ్రగ్స్ నియంత్రణలో పోలీసు, ఎక్సైజ్ శాఖలతోపాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. విద్యార్థులు ఫ్యాషన్ కోసమో, స్నేహితుల ఒత్తిడికి లోనై మత్తు పదార్థాల జోలికి వెళ్లి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. అర్హులైన ప్రతి పేదవాడికి పింఛన్ అందించాలనే లక్ష్యంతో దీపావళి సందర్భ:గా రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మందికి పైగా కొత్త పింఛన్లు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. -కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ డా.పి.శ్రీజ, డీఆర్డీవో కే.శ్రీరామ్, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్ అదనపు కమిషనర్ కిషన్, డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.
